మా పిల్లల భవిష్యత్తు ఏమిటో చెప్పండి సారూ!
అగమ్యగోచరంగా మారిన ఏకలవ్య పాఠశాల విద్యార్థినిల భవిష్యత్తు.
అల్లూరి సీతారామరాజు జిల్లా:
మా పిల్లల భవిష్యత్తు ఏమిటో చెప్పండి సారూ, అంటూ ఏకలవ్య మోడల్ పాఠశాలలో చదువుతున్న విద్యార్థినుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గత ఏడాది, కొయ్యూరు మండలంలోని బాలారం గ్రామంలో ఏకలవ్య మోడల్ పాఠశాల పేరుతో, మండలంలోని 30 మంది బాలురు, 30 మంది బాలికలను ఆరవ తరగతిలో జాయినింగ్ చేసుకున్నారు.
అయితే బాలారం గ్రామంలో ఏకలవ్య పాఠశాల భవనం నిర్మించేందుకు సన్నాహాలు కూడా జరిగాయి.
Related Posts
అప్పటి ఆర్డీవో శివజ్యోతి బాలారం గ్రామానికి వెళ్లి స్థలాన్ని పరిశీలించడం కూడా జరిగింది.
అయితే ఏమైందో తెలియదు కానీ ఇప్పటివరకు అక్కడ ఒక్క ఇటుకరాయి కూడా పేర్చలేదు.
ఏకలవ్య పాఠశాల భవనం
నిర్మించకపోవడంతో, నెల రోజుల పాటు వైఎన్ పాకలు బాలికల ఆశ్రమ పాఠశాలకు, ఆ తర్వాత చింతపల్లి ఏకలవ్య మోడల్ పాఠశాలకు బాలికలను తరలించి విద్యను అందించారు.
అయితే వేసవి సెలవుల అనంతరం, రెండు రోజుల నుంచి పాఠశాలలు తెరచి, తరగతులు కూడా జరుగుతున్నాయి.
అయితే బాలారం గ్రామంలో ఇప్పటికీ పాఠశాల భవన నిర్మాణానికి సంబంధించి, ఒక్క పునాది రాయి కూడా వేయలేదు.
గత ఏడాది లాగే, ఈ ఏడాది కూడా వేరే చోటుకు తరలించి అయినా విద్య అందిస్తారా అంటే, అది కూడా వివరాలు చెప్పలేని పరిస్థితుల్లో అధికారులు ఉన్నారు.
ఈ నేపథ్యంలో తమ పిల్లల భవిష్యత్తు ఏమిటని ఆ విద్యార్థినుల తల్లిదండ్రులు పొటుకూరి సన్యాసిరావు, సుర్ల భూమయ్య, వెంకటేశ్వర్లు తదితరులు ప్రశ్నిస్తున్నారు.
సీబీఎస్ఈ సిలబస్ అని, తమ పిల్లలకు ఉన్నత విద్య అందుతుందనే ఆశతో, ఏకలవ్య మోడల్ పాఠశాలలో జాయినింగ్ చేశామని వారు చెప్పారు.
కానీ ఇప్పటి వరకూ పరాయి పంచన విద్య అందించారని, ఇకపై తమ పిల్లలకు విద్య అందుతుందో లేదో తెలియని అయోమయ పరిస్థితుల్లో ఉన్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ క్రమంలో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, ఐటీడీఏ పీవో గోపాలకృష్ణ రోణంకి ఈ సమస్యపై దృష్టి సారించి, విద్యార్థినుల భవిష్యత్తు కాపాడాలని కోరుతున్నారు.