సిగినాపల్లి క్వారీలో భారీగా రంగురాళ్ల తవ్వకాలు.లక్షల్లో వ్యాపారం జరిగినట్టు సమాచారం.
బడా వ్యాపారుల ప్రోద్బలంతో తవ్వకాలు జరుపుతున్న గిరిజనులు.
తవ్వకాల వైపు కన్నెత్తి చూడని ఫారెస్ట్ అధికారులు.
అల్లూరి సీతారామరాజు జిల్లా: గూడెంకొత్తవీధి మండలం దామనపల్లి పంచాయతీ పరిధిలో సిగినాపల్లి గ్రామానికి ఆనుకుని ఉన్న ఎత్తైన కొండలలో దాగి ఉన్న ఖనిజ సంపద(రంగురాళ్లు)ను దోచుకోవడానికి బడా వ్యాపారులు కంకణం కట్టుకున్నారు. అమాయక గిరిజనుల చేత డబ్బు ఆశ చూపించి, డబ్బును ఎరగా వేస్తూ తవ్వకాలు జరిపిస్తున్న ఉదాంతం వెలుగులోకి వచ్చింది. అమాయక గిరిజనులకు వంట సామాగ్రి లతో సహా అక్కడకు తరలించి అక్కడే వంటావార్పు నిర్వహించి తవ్వకాలు జరిపిస్తున్నారు. అనుకోకుండా జరగరాని ప్రమాదం జరిగితే ప్రాణాలు గాలిలో కలిసిపోయే ప్రమాదం ఉంది అక్కడ. గతంలో రంగురాళ్ల తవ్వకాలలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయిన సందర్భం కూడా ఉంది. ప్రాణాలు పోతే ఎవరిది బాధ్యత. లక్షలలో వ్యాపారం జరిగినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇంత జరుగుతున్నా అటువైపు కన్నెత్తి కూడా చూడని ఫారెస్ట్ అధికారులు, ఫారెస్ట్ అధికారుల నిర్లక్ష్యానికి కారణమేమిటి? అన్నీ తెలిసి కూడా సంబంధిత అధికారులు చోద్యం చూస్తున్నారని అనేక అనుమానాలు తావిస్తున్నాయి. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి తవ్వకాలను నిలుపుదల చేసి క్వారీలో ఉన్న సొరంగాలను మూసివేయుటకు చర్యలు చేపట్టాలని స్థానిక గ్రామస్తులు కోరుతున్నారు.