నాడు – నేడు పనులపై కలెక్టర్ తీవ్ర అసంతృప్తి.
తప్పుడు నివేదికలపై సీరియస్.
పది రోజుల్లోగా సవరించకపోతే ఉన్నతాధికారుల దృష్టికి.
పని చేయని వారికి దూర ప్రాంతాలకు డెప్యుటేషన్.
అల్లూరి సీతారామరాజు జిల్లా, పాడేరు: నాడు – నేడు క్రింద రహదారులు భవనాల శాఖ చేపట్టిన ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల పనుల నిర్వహణ పట్ల జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ తీవ్ర అసంతృప్తిని వ్యక్తపరిచారు. సోమవారం కలక్టరేట్ సమావేశమందిరంలో ఆర్ అండ్ బి ఇంజినీరింగ్ అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ, పని పూర్తి కాకుండానే పూర్తి చేసి అప్పగించేసినట్లు తప్పుడు నివేదికలు ఇస్తున్నారని మండి పడ్డారు. తద్వారా ముఖ్యమంత్రికి ప్రభుత్వానికి తప్పు త్రోవ పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తపరిచారు. అదేవిధంగా పనులు చేపట్టిన 33 భవనాలలో పనులన్నీ అసంపూర్తిగా ఉన్నాయని, విధ్యుత్ సదుపాయం కల్పించి బిల్లులు అప్లోడ్ చేయలేదని, ఇన్వర్టర్ ఏర్పాటు చేయలేదని, టాయిలెట్లకు అవుట్ లెట్లు ఏర్పాటు చేయలేదని సకాలంలో బిల్లులు అప్లోడ్ చేయకపోతే ఎలా అని మందలించారు. ఈ విషయమై ఇంజనీర్ –ఇన్ చీఫ్ కు ప్రధాన కార్యదర్శికి లేఖ రాస్తానని హెచ్చరించారు. కాంట్రాక్టర్ ముందుకు రాకపోతే ప్రైవేటు వ్యక్తులతో చేయించి బిల్లు అందజేస్తే డబ్బు చెల్లిస్తానని కలెక్టర్ తెలిపారు. 85 రోజుల క్రితం రూడకోట, ఈదులపాలెం ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలను తనిఖీ చేసి పనుల గూర్చి స్వయంగా ఫోన్ చేసి చెప్పినప్పటికీ ఇప్పటి వరకు చెప్పిన పనులు చేయలేదని ఆగ్రహించారు.
జి.కే వీధి ప్రాధమిక ఆరోగ్య కేంద్రం పనుల ప్రగతిపై సమావేశం నుండే మెడికల్ అధికారితో మాటాడి తెలుసుకున్నారు. అక్కడ వారంలోగా ఇన్వర్టర్ ఏర్పాటు చేయకపోతే చర్యలు తీసుకుంటామని ఎఇఇ పై చర్యలు తీసుకుంటామన్నారు. అదేవిధంగా పినకోట పి హెచ్ సి సమీక్ష సందర్భంగా రెండు నెలల క్రితం సందర్శించి ఫోన్ చేసి చెప్పినప్పటికీ అక్కడ పనులు పెండింగ్ లో ఉండటం పట్ల ఆగ్రహం వ్యక్తపరిచిన కలెక్టర్ అందుకు సంబంధించి విశాఖపట్నం పర్యవేక్షక ఇంజినీర్ కు ఫోన్ చేసి తరచూ ఆయా ప్రాంతాలు సందర్శించి సమీక్షించాలని ఇంజినీరింగ్ అధికారులకు తగు సూచనలు జారీ చేయాలని ఆదేశించారు.
ఈ సందర్భంగా ఒక ప్రోఫార్మాను అప్పటికప్పుడు తయారు చేయించిన కలెక్టర్ 33 ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలు సంబంధిత ఇంజినీర్లు మరొక్క సారి తనిఖీ చేసి ఆయా ప్రాంతాలలో పెండింగ్ పనులను గుర్తించి ప్రోఫార్మాలో నమోదు చేసి సంబంధిత మెడికల్ అధికారితో ద్రువీకరింపజేసి నివేదిక సమర్పించాలని ఆదేశిoచారు. విధులు సకాలంలో పూర్తి చేయక, సక్రమంగా విధులు నిర్వర్తించక తప్పుడు నివేదికలు అందజేస్తే దూర ప్రాంతాలకు బదిలీ లేదా డెప్యుటేషన్ పై పంపిస్తామని హెచ్చరించారు. విధ్యుత్ కనెక్షన్లు ఇవ్వటం, ఇన్వర్టర్ ఏర్పాటు చేయటం జరగక ప్రసవ సమయంలో అవాంచనీయ సంఘటనలు జరిగితే సంబంధిత ఇంజినీరే దానికి పూర్తి భాద్యత వహించాల్సి ఉంటుందని, కేసులను ఎదుర్కోవలసి వస్తుందని హెచ్చరించారు. అదేవిధంగా పూర్తి ఐన పనులకు వెంట వెంటనే బిల్లులు అప్లోడ్ చేయాలని, కాంట్రాక్టర్లను పిలిచి సమీక్షించాలని పనులు త్వరగా, నాణ్యవంతంగా పూర్తీ చేయాలని ఆదేశించారు.
ఈ సమీక్షా సమావేశంలో ఐటిడిఎ ప్రాజెక్ట్ అధికారి రోణంకి గోపాల కృష్ణ, ఆర్ అండ్ బి కార్య నిర్వాహక ఇంజినీర్ బాల సుందర బాబు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. బి సుజాత, అదనపు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. లీలా ప్రసాద్, ఆర్ అండ్ బి ఉప కార్య నిర్వాహక ఇంజినీర్లు, సహాయ ఇంజినీర్లు తదితరులు పాల్గొన్నారు.