Breaking News

మంత్రి సీదరి అప్పలరాజు పద్ధతి మార్చుకోవాలని మావోయిస్టుల పేరిట హెచ్చరిక లేఖ.

0 17

 రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ నాయకుల భూకబ్జాలమీద మా పార్టీ (సీపీఐ (మావోయిస్టు)) ఇచ్చిన ప్రకటనపై మంత్రి సీదిరి అప్పలరాజు మోచేతి నీళ్ళు తాగి పని చేసే దళారీ ‘జనం’, ‘చిక్కోలు’ పత్రికలు అసత్యాలతో కూడిన దుష్ప్ర చార దాడిని ఖండించండి, నిలదీయండి!ప్రియమైన ప్రజలారా!


రాష్ట్రంలో వైఎస్ఆర్సిపీ నాయకులు అధికారాన్ని అడ్డంగా పెట్టుకొని ప్రజల భూములను కబ్జా చేయడం ఒక విధానంగా మారిపోయింది. దాన్ని ప్రశ్నించినా, ఉద్యమించిన ప్రజలపై పోలీసులు ఇతర అధికార యంత్రాంగాన్ని ఉపయోగించుకొని ప్రజలపై దాడులకు పాల్పడటం, అక్రమ కేసులు బనాయించడం సర్వసాధారణంగా మారిపోయింది. ఈ విషయంపై మా పార్టీ ప్రజలను తిరగబడాల్సిందిగా పిలుపునిస్తూ పత్రికా ప్రకటన విడుదల చేసింది. ఈ వార్తను వివిధ పత్రికలు ప్రచురించాయి. ఎలక్ట్రానిక్ మీడియా ప్రసారం చేసింది. ఈ వాస్తవాలపై ప్రజల్లో విస్తృతమైన చర్చ జరిగింది. దీనిపై వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, నాయకులు కూడా ఎక్కడా ఖండించలేదు. కానీ ‘జనం’, ‘చిక్కోలు’ పత్రికలకు మాత్రం పై వాస్తవాలు కనిపించకపోగా, మంత్రి సీదిరి అప్పలరాజు అవినీతి, అక్రమాలకు వకాల్తా పుచ్చుకొని ఎవరూ కనిపెట్టని గొప్ప సత్యాన్ని కనుగొన్నట్లుగా మా పత్రికా ప్రకటననే ‘నకిలీ ప్రకటన’ అని నిర్ధారిస్తూ తలా, తోకలేని వార్తలను ప్రచురించాయి. పైగా మా ప్రకటనను ‘ప్రజాకంఠక ముఠాకు అమ్ముకునే భావదారిద్ర్యానికి గురయ్యామనీ, తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి, అక్రమాలను మేము ఏనాడు ప్రశ్నించలేదనీ, గ్రౌండ్ లెవల్లో ఏం జరుగుతుందో తెలుసుకోకుండా అబద్దాలు, అసత్యాలతో కూడిన ప్రచారం చేస్తున్నామనీ, సీదిరి అప్పలరాజు కమ్యూనిస్టు భావాలున్న పీడిత ప్రజల గొప్ప నాయకుడనీ, ఆయన్ను విమర్శించే హక్కే మాకు లేదనీ, పిచ్చి ప్రేలాపనలతో కూడిన కనీస ఇంగితజ్ఞానం కూడా లేకుండా, జర్నలిజం అనే దాని కనీస విలువలు కూడా పాటించకుండా అహంకారంతో ఈ దళారీ పత్రికలు మంత్రి అప్పలరాజుపై తమ ప్రభుభక్తిని చాటుకున్నాయి. అసలు ఈ పత్రికలకు ప్రజల్లో ఉన్న విశ్వసనీయత ఏమిటని మేము ప్రశ్నిస్తున్నాము. ఎవరికి కనిపించని విధంగా ఈ పత్రికలకు మాత్రమే మా ప్రకటన ‘నకిలీ’ అని ఎలా అర్థం అయింది? మీ మంత్రి చెప్పాడా? మీ పోలీసు బాసులు చెప్పారా? పత్రికలు ఎప్పుడూ ప్రజలు చూడలేని వాస్తవాలను కూడా వెలికితీసి అవి ప్రశ్నించే గొంతులుగా ఉండాలి. ప్రజాపక్షం వహించేవిగా ఉండాలి. అప్పుడే పత్రికలపై ప్రజలకు విశ్వాసం ఉంటుంది. సమాజంలో అనేక మంది జర్నలిస్టులు, కొన్ని పత్రికలు ఈ విలువలకు కట్టుబడి పనిచేస్తూ, అధికారంలో ఉన్న వారిచేత, కార్పొరేట్లచేత, మాఫియాలచేత నిరంతరం దాడులకు గురవుతున్నాయి. కొందరు జైలు నిర్బంధాలను కూడా ఎదుర్కొంటున్నారు. ఇలాంటి పత్రికలపైనా, జర్నలిజంపైన మా పార్టీకి ఎనలేని గౌరవం ఉంది. వారి సద్విమర్శల్ని మనస్ఫూర్తిగా స్వీకరిస్తుంది, గౌరవిస్తుంది.

నేడు కొన్ని పత్రికలు కార్పొరేట్ సంస్థల, బూర్జవా పార్టీలచేత స్థాపించబడి వారికి వంతపాడుతూ వార్తలను ప్రచురించడమే వాటి విధిగా మారిపోయింది. ఇలాంటివారి వార్తాకథనాలకు ప్రజల్లో ఎలాంటి విశ్వసనీయత ఉండదు. రాష్ట్రంలో ప్రతిదినం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ, నాయకుల అక్రమార్జన, దోపిడీ, దౌర్జన్యాలపై, ప్రజలపై కొనసాగిస్తున్న దాడులపై ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై పుంకానుపుంకాలుగా వార్తలు మీడియా (సాక్షి, జనం, చిక్కోలు పత్రికలు మినహా)లో ప్రచారం గావించబడుతున్నాయి. దానిపై ఏ ఒక్కరు కూడా ఖండించనూలేదు. ‘గడప గడపకు కార్యక్రమంలో అడుగడుగునా ప్రజల నిరసన, ప్రతిఘటన ఎదుర్కొంటున్నారు. రాష్ట్రంలో ఏ ఒక్క వర్గం ప్రభుత్వ వ్యతిరేక పోరాటాలకు దిగకుండా ఉండలేని పరిస్థితి నెలకొని ఉంది. ఈ వాస్తవాలు ‘జనం’, ‘చిక్కోలు’ పత్రికలకు కనబడే అవకాశం ఉండకపోవచ్చు. ఎందుకంటే ఈ పత్రికలే ఆ పార్టీ దళారీ పత్రికలు. పైగా మా ప్రకటనను ‘అమ్ముకునే భావదారిద్ర్యానికి గురయ్యామనీ, మా భుజం మీద టీడీపీ, వైఎస్ఆర్ అసంతృప్తి ముఠా తుపాకీ పెట్టి కాల్చే అవకాశాన్ని కల్పిస్తున్నామని విమర్శిస్తూ రాసే నైతిక హక్కు మీకుందా అని మేము ప్రశ్నిస్తున్నాం. మేము క్షేత్రస్థాయి వాస్తవాలను చూడకుండా మాట్లాడుతున్నామనీ, కనీస ఇంగితజ్ఞానం లేకుండా పిచ్చిరాతలు రాసారు. సీదిరి అప్పలరాజును రక్షించడమే పరమావధిగా భావిస్తూ, ఆయనలో కమ్యూనిస్టు భావజాలముందనీ, పీడిత ప్రజల కోసం అంకితమై పని చేస్తున్నాడనీ, ఇంద్రుడు, చంద్రుడు, దేవేంద్రుడని ఆకాశానికెత్తి వీరు ప్రభుభక్తిని చాటుకున్నారు. ఆయన పుట్టింది వెనకబడిన మత్స్యకార కులంలోనే అయినప్పటికీ, చదివింది ఉన్నత చదువులే అయినప్పటికీ, ఆయన రాజకీయాల్లోకి వచ్చింది, అందులో వైఎస్ఆర్సీపీలో నాయకుడిగా ఎదిగింది ఏ వర్గాలకు సేవ చేయడానికీ? కోట్ల రూపాయల ప్రజాధనాన్ని అక్రమంగా పోగేసుకొని ఏర్పడిన వైఎస్ఆర్సీపీ బడా భూస్వాముల, దళారీ నిరంకుశ బూర్జువాల, సామ్రాజ్యవాదుల సేవలో మునిగితేలుతుంటే ఆ పార్టీలో మంత్రిగా ఉన్న సీదిరి మాత్రం సోషలిజం నిర్మించబోతున్నాడని ఈ పత్రికలు ప్రచారం చేస్తున్నాయి. రాష్ట్రంలో నేటికీ ఏ ప్రాంతంలో లేని విధంగా శ్రీకాకుళంలో వలసకూలీలు దేశం నలుమూలలకు వెళ్ళి పని చేసే పరిస్థితి ఎందుకుందో చెప్పాలి. కోస్టల్ కారిడార్ నిర్మాణం ద్వారా మత్స్యకారుల ఉపాధిని దెబ్బతీసి వారిని నిర్వాసితులను గావిస్తుంటే మంత్రి సీదరి ఎవరి పాదసేవలో ఉన్నాడో చెప్పాలి.రామక్రిష్ణాపురం భూములు, సూదికొండ, నెమలికొండ భూముల విషయంలో సూటిగా జవాబు చెప్పకుండా, వైఎస్ఆర్సీపీలోనే ఒక ముఠా వాటిని కాజేస్తున్నదని సెలవిచ్చారు. మరి ఈ సోషలిస్టు సీదిరి ప్రభుత్వం ఎందుకు అడ్డుకోలేదో మాత్రం జవాబు దాటవేసారు. టీడీపీ హయంలో అవినీతి అక్రమాల గురించి మేము ప్రశ్నించలేదని ఓ మూర్కపు ఆరోపణను చేసారు. కార్పొరేట్లకు దళారీగా, గనుల మాఫియాగా ఉంటూ, కోట్ల రూపాయల సంపదను పోగేసుకొని పోరాడే ఆదివాసీ రైతాంగంపై దాడిని కొనసాగించిన టీడీపీ నాయకులు కిడారి సర్వేశ్వరరావు, సీవేరి సోమలు ప్రజల చేతిలో శిక్షించబడిన వాస్తవాలను చూడలేని ఈ కబోదులకు ఏం చెప్పినా అర్థం కాదు. మా ఆచరణ, మా త్యాగాల గురించి మీ ‘జనం’, ‘చిక్కోలు’ పత్రికల సర్టిఫికేట్ పొందాల్సిన దుర్గతిలో మా పార్టీ లేదు. సీదిరి ఎంగిలి మెతుకులు తిని, వాడు విసిరే పచ్చ నోట్లకు పెంపుడు కుక్కల తోక ఊపుతూ పిచ్చిరాతలు రాసే మీ ప్రతికలకు ఎక్కువ వివరణ ఇచ్చి ప్రజల విలువైన సమయాన్ని వృధా చేయదలచుకోలేదు. వాస్తవాలేమిటో ప్రజలు గ్రహించలేనంత అమాయకులు కారు. దళారీ పత్రికల తలా, తోటలేని, ఎలాంటి విశ్వసనీయతలేని రాతలను ఖండించాల్సిందిగా, నిలదీయాల్సిందిగా ప్రజలకూ, ప్రజాస్వామిక వాదులకూ, మీడియాకు పిలుపునిస్తున్నాం.

ఈ పత్రికలో మాపై వచ్చిన వార్తలను ఖండిస్తూ, ఈ నెల 12వ తారీఖునా ‘విప్లవ యువజన సంఘం(వీయూఎస్) ఆంధ్ర ఓడిశా బార్డర్ కార్యదర్శి అశోక్’ పేరుతో విడుదలైన పత్రికా ప్రకటనా మా పార్టీకీ, మా ప్రజాసంఘాలకు ఎలాంటి సంబంధం లేదు. ఇది కూడా వైఎస్ఆర్సీపీలోని ఒక ముఠా దిగజారిపోయిన కొందరు మాజీ మావోయిస్టుల సృష్టి మాత్రమే. ఇలాంటి నకిలీ ప్రకటన ద్వారా ప్రజల్ని పక్కదారి పట్టించి అంతిమంగా మంత్రి సీదిరి అప్పలరాజును రక్షించడానికే దోహదపడేదని ప్రజలు గుర్తించాలని కోరుతున్నాము. ఈ మొత్తం నాటకాన్ని నడిపిస్తున్న మంత్రి సీదిరి అప్పలరాజు తన పద్ధతులను మార్చుకోవాలని హెచ్చరిస్తున్నాము.

Leave A Reply

Your email address will not be published.