Breaking News

ఆశ్రమ పాఠశాలల్లో ఇతరులకు ప్రవేశం నిషేధం.

0 19

 ఆశ్రమ పాఠశాలల్లో ఇతరులకు ప్రవేశం నిషేధం.

ఉత్తర్వులు జారీ చేసిన గిరిజన సంక్షేమ శాఖ ప్రిన్సిపాల్ కార్యదర్శి కాంతిలాల్ దండే.


గిరిజన సంక్షేమ విద్యా సంస్థలో భద్రత, సురక్షితమైన జీవన వాతావరణం కల్పించడానికి ఇతర వ్యక్తుల ప్రవేశాన్ని నిషేధిస్తూ గిరిజన సంక్షేమ శాఖ ప్రిన్సిపాల్ కార్యదర్శి కాంతిలాల్ దండే ఉత్తర్వులు జారీ చేశారు.

హైకోర్టు జువైనల్ జస్టిస్ కమిటీ చేసిన ఆదేశాల మేరకు ఐటిడిఏ ప్రాజెక్టు అధికారులు, ఉపసంచాలకులతో నిర్వహించిన వెబ్ కాన్ఫరెన్స్లో చర్చించి ఉన్నతాధికారుల అనుమతి లేకుండా అనధికార వ్యక్తులను గిరిజన ఆశ్రమ పాఠశాల లోపలకు అనుమతించకూడదని ఆదేశాలు జారీ చేశారు.

ఉన్నతాధికారుల అనుమతి లేకుండా గిరిజన సంక్షేమ విద్యాసంస్థల లోపలకు బయట వ్యక్తులు ప్రవేశిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చినందువలన ఐటీడీఏ పీఓ లకు తగిన సూచనలు జారీ చేశామన్నారు.

బాలికల విద్యా సంస్థల లోని డార్మిటరీ, టాయిలెట్ బ్లాక్ లలోకి పురుషులను అనుమతిస్తే నిర్వాహకులపై కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

విద్యాసంస్థలను అధికారికంగా సందర్శించే ఆయా ప్రాంతాలకు చెందిన ప్రజా ప్రతినిధులు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీపీ, జడ్పిటిసి, ఎంపిటిసి, సర్పంచులు, జిల్లా కలెక్టర్, ఐటిడిఏ పిఓ, సంయుక్త కలెక్టర్, డి ఆర్ ఓ, తాహశీల్దార్, ఎస్ పి, డి ఎస్ పి, సర్కిల్ ఇన్స్పెక్టర్, సబ్ ఇన్స్పెక్టర్లు, కమిషనర్ పాఠశాల విద్య డిఈఓ లు, ఎంఈఓ లు, ఏ టి డబ్ల్యూ ఓ లు, వైద్యాధికారులు, ఎంపీడీవోలను అనుమతిస్తామన్నారు.

బాలికల డార్మెంటరీ, మరుగుదొడ్లకు పురుషులకు ప్రవేశం లేదన్నారు.

ఇతర అధికారులు, దాతలు, మీడియా ప్రతినిధులు, సామాజిక కార్యకర్తలు విధిగా జిల్లా ఉన్నతాధికారుల అనుమతి తీసుకున్నాకే ప్రవేశించాలన్నారు.

గ్యాస్, కూరగాయలు, ఇతర నిత్యావసర సరుకుల పంపిణీదారులు గేటు వరకు మాత్రమే అనుమతిస్తారని ఉత్తర్వులలో పేర్కొన్నారు.

ప్రధానోపాధ్యాయులు, ప్రిన్సిపాల్, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ అనుమతి లేకుండా విద్యాసంస్థల ప్రాంగణంలోకి బయట వ్యక్తులు అడుగుపెట్టకూడదన్నారు.

ఉత్తర్వులను ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

తల్లిదండ్రులకు ప్రత్యేకమైన సమయం కేటాయిస్తామన్నారు. ప్రతి ఒక్కరూ జువైనల్ కోర్టు ఆదేశాలను గౌరవించి పై ఆదేశాలు తూ:చా తప్పకుండా పాటించాలన్నారు. లేనియెడల కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Leave A Reply

Your email address will not be published.