అల్లూరి జిల్లా,కొయ్యూరు సెప్టెంబర్ 30: స్వగ్రామానికి ఇంటికి వెళ్లి అనారోగ్యానికి గురై విశాఖపట్నం కెజిహెచ్ లో గత నాలుగు రోజులుగా చికిత్స పొందుతున్న చింతపల్లి మండలం కొడసింగి గ్రామానికి చెందిన కొర్రా సురేష్ సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు కేజీహెచ్ నుంచి అనధికారకంగా స్వగ్రామానికి వెళ్లిపోయాడు. డౌనూరు ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థి కోర్రా సురేష్ అస్వస్థతకు గురయ్యాడని తెలుసుకున్న సహాయ గిరిజన సంక్షేమ అధికారి క్రాంతి కుమార్,ప్రధానోపాధ్యాయుడు ప్రభుదాస్ పట్టుపట్టి విశాఖపట్నం కెజిహెచ్ ఈనెల 25వ తారీఖున ఆస్పత్రిలో చేర్పించారు. గత నాలుగు రోజులుగా కేజీహెచ్ లోని భవన వార్డులో వైద్య సేవలు పొందుతున్నాడని సహాయ గిరిజన సంక్షేమ అధికారి క్రాంతి కుమార్ తెలిపారు.విద్యార్థి స్వల్పంగా కోలుకున్నాడని మరో నాలుగు రోజుల్లో ఆసుపత్రి నుంచి డిస్చార్జ్ చేస్తారని చెప్పారు. విద్యార్థి తండ్రి రాముడు, హెచ్డబ్ల్యువో కే హరిదేవ్ విద్యార్థికి సహాయంగా ఆసుపత్రిలోనే ఉంటున్నారని అన్నారు. మధ్యాహ్నం 12 గంటలకి హరిదేవ్ రిపోర్ట్ తీసుకోవడానికి లేబ్ కు వెళ్ళిన సమయంలో తల్లిదండ్రులు విద్యార్థిని తీసుకొని స్వగ్రామానికి వెళ్లిపోయారని అన్నారు. నాటు వైద్యం చేయించడానికి స్వగ్రామానికి వెళ్లి ఉంటారని అధికారులు భావిస్తున్నారు. విద్యార్థికి ఏదైనా అనుకోని సంఘటన జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని అధికారులు ఆందోళన చెందుతున్నారు. బుధవారం అర్ధరాత్రి ఐటిడిఏ ప్రాజెక్ట్ అధికారి అభిషేక్ ఆదేశాల మేరకు, ప్రభుత్వ నిబంధనలను అనుసరించి ఎంతో వ్యయ ప్రయాసలుపడి గిరిజన విద్యార్థి కొర్రా సురేష్ ను ఆసుపత్రికి తరలించి మెరుగైన వైద్య సేవలు అందించారు. వైద్య సేవలు పొందకుండా తిరిగి స్వగ్రామానికి వెళ్ళిపోయారని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.