Breaking News

స్వంతంగా రహదారి పనులు చేసుకుంటున్న గంపరాయి గ్రామస్తులు.

0 19

స్వంతంగా రహదారి పనులు చేసుకుంటున్న గంపరాయి గ్రామస్తులు.


అల్లూరి సీతారామరాజు జిల్లా: కొయ్యూరు మండలంలోని అంతాడ పంచాయతీ పరిధిలో ఉన్న గంపరాయి గ్రామానికి రహదారి సౌకర్యం లేకపోవడంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

గ్రామానికి రహదారి సౌకర్యం కల్పించాలని ఇప్పటికే పలుమార్లు అధికారులకు, ప్రజాప్రతినిధులకు విన్నవించినా పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


నిత్యావసర సరుకుల కోసం బయటకు వెళ్లాలన్నా, అనారోగ్యంతో బాధపడుతున్న వారిని కనీసం ఆసుపత్రికి తీసుకుని వెళ్లాలన్నా ఇబ్బందులు తప్పడం లేదని వాపోతున్నారు.

గతంలో 2018 సంవత్సరంలో సుమారు 34 కుటుంబాల వారు సుమారు 4 లక్షల 80 వేల రూపాయలు స్వంత నిధులు సమకూర్చుకుని రహదారి మరమ్మతులు చేపట్టామని చెబుతున్నారు.

కానీ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదన్నారు. 

అలాగే ప్రస్తుత వైసీపీ ప్రభుత్వంలో, గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా, స్థానిక ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి, తమ పంచాయతీ పరిధిలోని సింగధార, ఎద్దుమామిడి తదితర గ్రామాల్లో పర్యటించారని చెప్పారు.

ఆ సమయంలో రహదారి లేక తాము పడుతున్న ఇబ్బందులను స్వయంగా గమనించిన ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి, తమ గ్రామాలకు రహదారి సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చారని తెలిపారు.

ఎమ్మెల్యే హామీ ఇచ్చి రోజులు గడుస్తున్నా,హామీ అమలు కాలేదని ఆవేదన చెందుతున్నారు. 

గత్యంతరం లేక మళ్లీ రెండు రోజుల నుంచి స్వంతంగా రహదారి మరమ్మతు పనులు చేసుకుంటున్నామని తెలిపారు.

తమ ఓట్లతో అధికారం అనుభవిస్తున్న ప్రజాప్రతినిధులకు తమ బాధలు కనిపించడం లేదని ఆవేదన చెందుతున్నారు.

పబ్లిసిటీ కోసం మీడియాల్లో ప్రకటనలు ఇస్తున్నారు తప్ప,ఆచరణలో అమలు కావడం లేదని,ఇచ్చిన హామీలను నెరవేర్చి, తమ చిత్తశుద్ధి నిరూపించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.