కేజీహెచ్‌లో ఎస్టీ సెల్‌ను బలోపేతం చేయాలి.
వైద్యశాఖా మంత్రి విడదల రజనీ తో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో పాడేరు శాసన సభ్యులు కొట్టగుళ్ళి భాగ్యలక్ష్మి.
గిరిజన ప్రాంతంలో వైద్య పరంగా అనేక సమస్యలు ఉన్నాయని పాడేరు శాసనసభ్యులు కొట్టగుళ్ళి భాగ్యలక్ష్మి అన్నారు. ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో భాగ్యలక్ష్మి శుక్రవారం మాట్లాడారు. ఈ సందర్భంగా గిరిజన ప్రాంతంలో వైద్య పరంగా ఎదురవుతున్నటువంటి సమస్యలు అన్నిటిని మంత్రి దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా కేజీహెచ్ లో ఎస్టీ సెల్ ను బలోపేతం చేయడం విషయంలో సుదీర్ఘంగా చర్చించారు. అక్కడ గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు. పరిష్కరించాలని మంత్రిని కోరారు. గిరిజనులు వైద్యం కోసం కేజీహెచ్ లో ఎస్టీ సెల్ కి వెళ్ళినప్పుడు ఎదురైనటువంటి సంఘటనలు ఈ సందర్భంగా మంత్రి తో చర్చించారు. ఇటీవల ఎస్టీ సెల్ లో జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో ఇప్పుడున్న ఒక డాక్టర్ తో పాటు అదనంగా మరో డాక్టర్ ను నియమిస్తామని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే అమలు చేయాలని కోరారు. దాంతోపాటు ప్రతి సచివాలయంలోని కేజీహెచ్ లో ఉన్న ఎస్టీలకు సంబంధించిన ప్రతి డాక్టర్ కు సంబంధించిన సమాచారం ప్రతి సచివాలయంలో అందుబాటులో ఉంచాలని సూచించారు. కేజీహెచ్ లో ఉన్న ఎస్టీ సెల్ లో సదుపాయాలు సరిగా లేవనేటువంటి విమర్శలు తీవ్ర స్థాయిలో ఉన్నాయని అదే విషయాన్ని చాలా మంది తన దృష్టికి తీసుకొచ్చారని తెలిపారు. అందుకే అక్కడ మార్పులు రావలసిన అవసరం ఎంతైనా ఉందని ఆ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని చాలా మంది తమని సంప్రదిస్తున్నారని భాగ్యలక్ష్మి మంత్రి విడదల రజనీ కి వివరించారు.
ఆరోగ్యశ్రీ పై అవగాహన కల్పించాలి:
ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో ఉండే వారందరికీ ప్రభుత్వం కల్పిస్తున్న వైద్య సదుపాయాల పైనా పూర్తి అవగాహన ఉండడం లేదని ఈ నేపథ్యంలో ఆరోగ్య శ్రీ ఎంతవరకు వర్తిస్తుంది? ఎటువంటి వ్యాధులకు వర్తించే అవకాశం ఉందన్న విషయాన్ని తెలియజేసేలా ఒక వ్యక్తిని నియమించాలని చెప్పారు. దాంతోపాటు కేజీహెచ్ లో ఎస్టీసెల్ కు వెళ్లిన వెంటనే గిరిజనులు ఇబ్బంది పడకుండా ఆరోగ్య మిత్ర నేరుగా సంబంధిత బాధితుల దగ్గరకు వచ్చి ఆరోగ్యశ్రీ వర్తిస్తుందా? లేదా? వైద్య విషయంలో ఎవరిని సంప్రదించాలి తదితర విషయాలను తనే స్వయంగా చూసుకునే విధంగా ఆదేశాలు జారీ చేయాలని చెప్పారు. ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్ నెంబర్లను కూడా ప్రతి సచివాలయంలో డిస్ ప్లే చేయాలని కోరారు. దీనిపై మంత్రి సానుకూలంగా స్పందించి శాసన సభ్యులు తన దృష్టికి తీసుకొచ్చిన సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.