బెంగళూరు రేవ్ పార్టీ కేసులో సినీ నటి హేమ అరెస్ట్ అయ్యారు. గత నెలలో కర్ణాటక బెంగళూరులోని ఓ ఫామ్‌హౌస్‌లో జరిగిన రేవ్ పార్టీని అక్కడి పోలీసులు భగ్నం చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి పోలీసులు విచారణ చేపట్టారు. ఇందులో భాగంగా నటి హేమ ను తమ ముందు విచారణకు హాజరు కావాల్సిందిగా రెండుసార్లు నోటీసులు ఇచ్చారు. మే 27న రావాలని తొలుత నోటీసులు ఇవ్వగా, తనకు జ్వరం కారణంగా రాలేకపోతున్నానని, వారం రోజుల గడువు కావాలంటూ ఆమె కోరారు. దాంతో జూన్ 1న విచారణకు రావాలంటూ మరోసారి నోటీసులు జారీ చేశారు. అప్పుడూ డుమ్మా కొట్టడంతో తాజాగా మరోసారి నోటీసులు ఇచ్చి, విచారణ అనంతరం ఆమెను అరెస్ట్ చేశారు.
ఇదీ అసలు విషయం..బెంగళూరు శివారులో నిర్వహించిన రేవ్ పార్టీలో పలువురు తెలుగు టీవీ నటీనటులు,మోడళ్లు పట్టుబడిన విషయం తెలిసిందే. ఇదే పార్టీకి వచ్చిన ఓ కారులో ఏపీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి సంబంధించిన స్టిక్కర్ కూడా దొరికింది. పార్టీలో పలు రకాల డ్రగ్స్ వాడినట్లు పోలీసులు గుర్తించారు. 86 మంది మాదక ద్రవ్యాలు తీసుకున్నట్లు వైద్య పరీక్షల్లో తేలిందని నగర నేర నియంత్రణ దళం (సీసీబీ) అధికారులు వెల్లడించారు. 73 మంది పురుషుల్లో 59 మందికి, 30 మంది మహిళల్లో 27 మందికి వైద్య పరీక్షలో డ్రగ్ పాజిటివ్ వచ్చిందని పేర్కొన్నారు.