Breaking News

ఏజెన్సీ ప్రాంత భూములపై హక్కు ఎవరిది?

0 19

 ఏజెన్సీ ప్రాంత భూములపై హక్కు ఎవరిది?


(అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం):ఐదవ షెడ్యూల్ ఏరియా 1/70 యాక్ట్ ప్రకారం ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న భూములపై హక్కు ఎవరిది? పట్టాలు ఉన్న గిరిజనులకా? లేక ఎటువంటి హక్కులు లేని భూమిని ఆక్రమిస్తున్న గిరిజనేతరులకా? అని జేఏసీ మండల కో కన్వీనర్ శాసుం వాణీ ప్రకాష్ ప్రశ్నించారు.

ఈ మధ్యకాలంలో రావణాపల్లి,రేవళ్లు, సింగవరం ఇతర గ్రామాల్లో కొయ్యూరు మండల వ్యాప్తంగా అనేక గ్రామాల్లో యధేచ్చగా గిరిజనేతరులు భూములు ఆక్రమిస్తున్నారు.. దీనికి బాధ్యులు ఎవరు? వాణీ ప్రకాష్ అంటున్నారు. బాధ్యత వహించాల్సిన రెవెన్యూ సిబ్బంది ఆక్రమణదారులకు వత్తాసు పలుకుతూ పొజిషన్ రికార్డ్ ఇస్తున్నారన్నారు. అసలు ఏజెన్సీ ప్రాంతంలో 1/70 యాక్ట్ ప్రకారం గిరిజనేతరులు అనే వ్యక్తులకు ఎటువంటి హక్కులు లేనప్పుడు పొజిషన్ ఎలా ఇస్తారు?చట్టాలు తెలిసినటువంటి అధికారుల్లారా మీకు కళ్ళు,చెవులు లేవా? చట్టాలను అమలుపరచాల్సిన బాధ్యత మీకు లేదా? దీనిపై బాధ్యత వహించాల్సిన ప్రజా ప్రతినిధులు అయిన ఎంపీ,ఎమ్మెల్యే లు మీరు ఎక్కడున్నారు? మీ సొంత జాతికి అన్యాయం జరుగుతుంటే మీరు ఏం చేస్తున్నారు?కేవలం మీరు ఓట్లు కోసమేనా?గిరిజన హక్కులు మీకు అవసరం లేదా? ఈ ఏజెన్సీ ప్రాంతంలో 1/70 ప్రకారం సర్వహక్కులు భూమిపైన గిరిజనులకు మాత్రమే కల్పించబడ్డాయి. కానీ అధికారం మదంతో డబ్బు ప్రోద్బలంతో భూమిని ఆక్రమిస్తున్న అక్రమార్కులకు రెవెన్యూ సిబ్బంది,రాజకీయ నాయకులు,అధికార పార్టీ రాజకీయ నాయకులు అండగా ఉంటున్నారని ఎద్దేవా చేశారు. చట్టాలు అమలు పరచాల్సిన రెవెన్యూ సిబ్బంది మూగ,చెవిటి,గుడ్డి,వికలాంగత్వం ప్రదర్శిస్తున్నారన్నారు. ఈ ఏజెన్సీ ప్రాంతంలో మీకు జీతాలు ఇస్తున్నది ఎందుకు? అసలు గిరిజనేతరులకు పొజిషన్ ఎలా ఇస్తారు? ఇది ముమ్మాటికీ మీ తప్పు కాదా అని ప్రశ్నించారు. మీరు కాసులకు కక్కుర్తి పడి మీ తప్పిదం వలన ఎంతో మంది గిరిజనులు తమ భూమి హక్కును కోల్పోతూ అనేక బాధలు అనుభవిస్తున్నారన్నారు. కోర్టు చుట్టూ, ఆఫీసు చుట్టూ కాళ్ళు అరిగేలా తిరుగుతున్నారన్నారు. ఎటువంటి భూమి హక్కులు గాని పట్టాలు గాని లేని గిరిజనేతరులు దర్జాగా భూమిని ఆక్రమిస్తూ అనుభవిస్తున్నారన్నారు.

   1/70 యాక్ట్ ను అమలు పరచడం అధికారుల విధి. కానీ కళ్ళు,చెవులు మూసుకుంటున్నారని ఆంధ్రప్రదేశ్ ఆదివాసి జేఏసి కొయ్యూరు మండల కమిటీ నాయకులు తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విధంగా కొనసాగితే ఆదివాసి ప్రజల నుంచి తీవ్ర ఉద్యమం చూడాల్సి వస్తుందని అధికారులకు,అక్రమార్కులకు ఆదివాసి జేఏసీ హెచ్చరికలు జారీ చేస్తున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆదివాసి జేఏసీ మండల కన్వీనర్ మాకాడ బూరుగులయ్య,కో కన్వీనర్ సాసుం వాని ప్రకాష్,కాకర చిన్నారావు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.