పోలీసుల ఆధ్వర్యంలో ‘సేతు’ కార్యక్రమం.
(అల్లూరి సీతారామరాజు జిల్లా, కొయ్యూరు): కొయ్యూరు పోలీసులు ఆధ్వర్యంలో మంగళవారం మండలంలోని నడింపాలెం,శరభన్నపాలెం గ్రామాలకు మధ్యనున్న ఎర్రకొండమ్మ తల్లి జాతర మహోత్సవాల్లో ఏర్పాటు చేసిన ‘సేతు’ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. అల్లూరి సీతారామరాజు జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో కొయ్యూరు సీఐ స్వామి నాయుడు నేతృత్వంలో కొయ్యూరు, మంప ఎస్సైలు రాజారావు, లోకేష్ కుమార్ ల ఆధ్వర్యంలో మహిళా పోలీసులతో కలిసి సేతు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమం ద్వారా ఈనెల 25,26 తేదీలలో ఆధార్ అప్డేషన్, ఆధార్ కార్డులో మార్పులు చేర్పులు, కార్డు లేని వారికి కొత్త కార్డు మంజూరుకు నమోదు తదితర పలు కార్యక్రమాలను చేపట్టారు. ముఖ్యంగా వాహన ప్రమాదాల నివారణ చర్యల్లో భాగంగా మండలంలో అర్హత ఉండి డ్రైవింగ్ లైసెన్స్ లేని యువతీ యువకుల వివరాల సెల్ నెంబర్ నమోదు చేపట్టారు. అటువంటి వారందరికీ త్వరలోనే మండల కేంద్రంలో పోలీసుల ఆధ్వర్యంలో మెగా లైసెన్స్ మేళా కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు సిఐ స్వామినాయుడు తెలిపారు. సేతు కార్యక్రమం ద్వారా అల్లూరి జిల్లా పోలీస్ శాఖ కల్పించే ఈ అవకాశాన్ని ఆసక్తిగల అర్హులైన అభ్యర్థులు యువతీ యువకులు సద్వినియోగం చేసుకోవాలని కొయ్యూరు పోలీసులు కోరారు.