*పాడేరు నియోజకవర్గంలో వైసిపి గెలుపు తథ్యం.
*గెలుపు గుర్రాలకే టికెట్లు కేటాయించిన సీఎం జగన్.
అల్లూరి సీతారామరాజు జిల్లా,పాడేరు నియోజకవర్గం: 2024 సార్వత్రిక ఎన్నికల్లో పాడేరు నియోజకవర్గంలో వైసీపీ గెలుపు తధ్యమని కొయ్యూరు పిఎసిఎస్ చైర్మన్ సుమర్ల సూరిబాబు ధీమా వ్యక్తం చేశారు. స్థానిక విలేకరులతో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమలుపరుస్తున్న సంక్షేమ పథకాలే వైసిపి అభ్యర్థుల విజయానికి శ్రీరామరక్ష అన్నారు. ముఖ్యంగా అల్లూరి సీతారామరాజు జిల్లా కేంద్రమైన పాడేరు నియోజకవర్గంలో యువనేత, ప్రతి ఒక్కరితో కలుపుగోరుగా వ్యవహరించే విశ్వేశ్వరరాజుకి సీటు కేటాయించడం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ముందు చూపుకు నిదర్శనం అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా సిటింగ్ ఎమ్మెల్యేలను కాదని గెలిచే అభ్యర్థులనే ధైర్యంగా ఎంపిక చేసి సమన్వయ పరిచిన సత్తా జగన్ దే అన్నారు. పాడేరు నియోజకవర్గంలో ప్రతిపక్ష అభ్యర్థులను దీటుగా ఎదుర్కోగల సత్తా విశ్వేశ్వర రాజుకు ఉందని, నియోజకవర్గ సమన్వయకర్తగా ఆయన నియామకంతోనే పార్టీ గెలుపుకు బాటలు వేశారని సూరిబాబు స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా గత ప్రభుత్వాలకు భిన్నంగా ఎటువంటి వివక్షత బేద భావాలు లేకుండా అర్హతే ప్రామాణికంగా అర్హులందరికీ సంక్షేమ పథకాలను వర్తింప చేస్తున్న ఘనత వైసీపీ ప్రభుత్వానిదే అన్నారు. అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా తండ్రి బాటలో నడుస్తూ రాజశేఖర్ రెడ్డి ఆశయాలను నెరవేర్చడమే కాకుండా ప్రజలందరికీ మేలు చేకూరే విధంగా వైసీపీ ప్రభుత్వం పాలన సాగించడం అభినందనీయమన్నారు. రానున్న ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా వైసిపి విజయఢంకా మోగించడం ఖాయమని ఆ గెలుపు పాడేరు నియోజకవర్గం నుండే ప్రారంభమవుతుందని సూరిబాబు జోస్యం చెప్పారు. ప్రజలందరి సంక్షేమాన్ని కాంక్షించే వైసీపీకే రానున్న ఎన్నికల్లో ప్రజలంతా పట్టం కట్టాలని ఆయన కోరారు.