*అభివృద్ది కనిపించని కొత్తరోగం ప్రతిపక్షాలకు వచ్చింది
– మంత్రి ఆర్కేరోజా
*ఎలకాటూరులో ఒకే ప్రాంగణంలో రూ.82 లక్షల మేర అభివృద్ధి పనుల ప్రారంభం
ఆంధ్రప్రదేశ్ నిండ్ర :అభివృద్ది కనిపించని కొత్తరోగం ప్రతిపక్షాలకు వచ్చిందని రాష్ట్ర పర్యాటక,సాంస్కృతిక,యువజన సర్వీసుల,క్రీడాశాఖ మంత్రి ఆర్కేరోజా అన్నారు.సోమవారం మండలంలోని ఎలకాటూరులో ఒకే ప్రాంగణంలో రూ. 40 లక్షల వ్యయంతో నిర్మించిన సచివాలయ భవనం,రూ.21.8 లక్షలతో నిర్మించిన రైతు భరోసా కేంద్రం,రూ.20.8 లక్షల వ్యయంతో నిర్మించిన వెల్‌నెస్ సెంటర్‌లను ఆమె ప్రారంభించారు.
ఇంతటి ఆభివృద్ధిని తమ గ్రామానికి చేసిన మంత్రికి స్థానిక మహిళలు కర్పూర హారతులు పట్టారు.గజమాలలతో సత్కరించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గతంలో టీడీపీ ప్రభుత్వం అభివృద్ధిని కాగితాలకే పరిమితం చేసిందన్నారు. నేడు ఇంతటి అభివృద్ధి జరుగుతున్నా ప్రతిపక్షాలు అభివృద్ధి జరగలేదనటం చూస్తుంటే వారికేదో కొత్తరోగం వచ్చినట్లుందన్నారు. రంగులు కనిపించని వ్యాధి కంటికి వచ్చేలా అభివృద్ధి పనులు కనిపించని వ్యాధి ప్రతిపక్షాలకు వచ్చినట్లుందన్నారు. నియోజకవర్గంలో ఎక్కడకు వెళ్లి అడిగినా అభివృద్ధిని ప్రజలే తీసుకెళ్లి చూపిస్తారన్నారు.సచివాలయ,వాలంటీర్లు వ్యవస్థలలో ప్రజల చెంతకే పాలనను జగనన్న తీసుకెళ్తున్నారన్నారు. గ్రామంలోని రైతులకు పరిపాలనకు సంబంధిత సమస్యల పరిష్కారానికి సచివాలయం, వ్యవసాయ సంబంధిత సమస్యల పరిష్కారానికి రైతుభరోసా కేంద్రం, ఆరోగ్య రక్షణకు వెల్‌నెస్ సెంటర్,ఒక ప్రాంగణంలో ఉందంటే ఇది కాదా అభివృద్ధి అన్నారు. సచివాలయ పరిధిలోని గ్రామస్థులకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ప్రతి సచివాలయ పరిధిలోను కోటి రూపాయలు అభివృద్ధికి వినియోగిస్తున్నామన్నారు. ఇలా మంచి చేసే ప్రభుత్వానికి ప్రజలు అండగా నిలవాలన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు,వైస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.