Breaking News

జగన్మోహన్ రెడ్డికి ఒక్క ఛాన్స్..నిరుద్యోగులకు నో ఛాన్స్-టీడీపీ పార్టీ పాడేరు నియోజకవర్గ ఇన్చార్జ్ గిడ్డి ఈశ్వరి

0 21

 జగన్మోహన్ రెడ్డి పాలనలో ఉపాధి కల్పన నిల్..గంజాయి ఫుల్

మాదకద్రవ్యాల వైపు మొగ్గు చూపుతున్న యువత

జగన్మోహన్ రెడ్డికి ఒక్క ఛాన్స్.. నిరుద్యోగులకు నో ఛాన్స్

-తెలుగుదేశం పార్టీ పాడేరు నియోజకవర్గ ఇన్చార్జ్ గిడ్డి ఈశ్వరి

గిడ్డి ఈశ్వరి (మాజీ ఎమ్మెల్యే)

(అల్లూరి జిల్లా,పాడేరు):జగన్మోహన్ రెడ్డి పాలనలో ఉపాధి కల్పన నిల్.. గంజాయి ఫుల్ గా ఉందని తెలుగుదేశం పార్టీ పాడేరు నియోజకవర్గం ఇంచార్జ్ గిడ్డి ఈశ్వరి అన్నారు. గురువారం ఆమె తన స్వగృహంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వైకాపా ప్రభుత్వం ఏర్పడి నాలుగేళ్లు పూర్తికావస్తున్న యువతకు ఒక్క ఉపాధి అవకాశం కల్పించిన దాఖలు లేవన్నారు. ప్రభుత్వ వైఫల్యం కారణంగా యువత మాదకద్రవ్యాలకు బానిసలవతున్నారన్నారు. జగన్మోహన్ రెడ్డి నాలుగేళ్ల పాలనలో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB) ప్రతీ ఏటా విడుదల చేసే వార్షిక నివేదిక ప్రకారం గంజాయి రవాణాలో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో కొనసాగుతుందని అన్నారు. అధికారిక లెక్కల ప్రకారం 2021లో దేశ వ్యాప్తంగా సుమారు 7.5 లక్షల కిలోల గంజాయిని అధికారులు సీజ్ చేస్తే దానిలో రెండు లక్షలకు పైగా గంజాయి కేవలం ఆంధ్రప్రదేశ్ లోనే పట్టుబడిందని, దేశంలో పట్టుబడిన మొత్తంతో పోల్చితే ఇది సుమారు 26 శాతానికిపైగా ఉందని అన్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి 2019లో 70,229 కేజీలు, 2020 లో 97,826 కేజీలు, 2021లో 2,00,588 కేజీలను అధికారులు సీజ్ చేశారని తెలిపారు. ప్రతిరోజు కొన్ని లక్షల టన్నుల గంజాయి ఆంధ్రప్రదేశ్ సరిహద్దులు దాటుతుంటే… తరలించే వారిపై మాత్రం కేవలం 1775 కేసులు మాత్రమే పెట్టారని, దీనిని బట్టి చూస్తే వైసీపీ నాయకులు గంజాయి మాఫీయాకు ఏవిధంగా సహకరిస్తున్నారో అర్థం అవుతుందని అన్నారు. ఒకప్పుడు దేశం మొత్తానికి ఆహారాన్ని అందించి అన్నపూర్ణగా నిలిచిన ఆంధ్రప్రదేశ్, జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక గంజాయి, మాదక ద్రవ్యాల అక్రమ రవాణాకు హబ్ గా మారిందని ఆరోపించారు. జగన్మోహన్ రెడ్డి తన పాదయాత్రలో ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్, మెగా డీఎస్సీ, స్పెషల్ డిఎస్సీ ఇస్తామని యువతకు ఎన్నో హామీలు ఇచ్చారన్నారు. ఇచ్చిన హామీలు 90 శాతం నెరవేర్చామని గొప్పలు చెప్పుకుంటున్న వైకాపా ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ మెగా డీఎస్సీ, స్పెషల్ డీఎస్సీ ఎక్కడ నెరవేర్చారో చూపించాలని ప్రశ్నించారు. అట్టహాసంగా గ్లోబల్ ఇన్వెస్ట్ మెంట్ సమ్మిట్ పేరుతో జగన్మోహన్ రెడ్డి తీసుకువచ్చిన 6 లక్షల ఉద్యోగాలు ఎక్కడ ఉన్నాయన్నారు. అబద్దపు, బూటకపు మాటలు చెప్పి యువతను మోసం చేయడం తప్ప వైసీపీ ప్రభుత్వం చేసింది ఏమీ లేదని అన్నారు. జగన్ మోహన్ రెడ్డి “ఒక్క ఛాన్స్, ఒక్క ఛాన్స్” అని అడిగితే ప్రజలు ఆయనకు ఒక్క ఛాన్స్ ఇచ్చారని, కానీ యువతకు మాత్రం అది “నో ఛాన్స్” గా మిగిలిపోయిందని అన్నారు. రానున్న ఎన్నికలలో వైకాపాను ఇంటికి పంపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు.

Leave A Reply

Your email address will not be published.