Breaking News

జగనన్న గోరుముద్ద అమలు తీరును పరిశీలించిన రాష్ట్ర బాలల హక్కుల కమిషన్

0 220

విశాఖపట్నం:రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం అమలు చేస్తున్న విద్యార్థుల మధ్యాహ్న భోజన పథకం జగనన్న గోరుముద్ద అమలు తీరును ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్(ఏపి ఎస్సీపిసీఆర్) సభ్యులు గొండు సీతారాం మంగళవారం సీతమ్మధార జీవీఎంసీ ఎన్ఎంసి.హైస్కూల్ లో భోజన సమయంలో పరిశీలించారు.విద్యార్థులతో కలిసి భోజనం చేశారు.

అనంతరం విద్యార్థులతోను,విద్యా శాఖాధికారులు,మధ్యాహ్న భోజన పథక నిర్వాహకులు,అక్షయ పాత్ర ప్రతినిధులతో మాట్లాడారు.మొత్తం ఎంతమంది విద్యార్థులు ఈ భోజనాన్ని స్వీకరిస్తున్నారు,స్వీకరించని వారి శాతం ఎంత,ఇటువంటి పిల్లలకు,వారి తల్లిదండ్రులకు పౌష్టికాహారంపై ఎటువంటి అవగాహన చర్యలు చేపడుతున్నారు,కోడి గుడ్డు నాణ్యత,బరువుపై ఆరా తీశారు.ప్రతీ దినం అందించే మెనూ పైనా పూర్తి వివరాలను సేకరించారు.ఆహార పదార్థాలను మార్పు చేయాల్సిన అంశాలను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం సీతారాం మాట్లాడుతూ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్ పర్సన్ కేసలి అప్పారావు సూచనలు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో మధ్యాహ్న భోజన పథకంపై పరిశీలన జరుపుతున్నామని అన్నారు.విద్యార్థులు,వారి తల్లిదండ్రులు,యాజమాన్య కమిటీలు సూచించిన మార్పు,చేర్పులను రాష్ట్ర ప్రభుత్వానికి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ద్వారా తెలియజేయనున్నట్టు చెప్పారు.అంతిమంగా ప్రభుత్వం అమలుచేస్తున్న ఈ భోజన పథకాన్ని శతశాతం పిల్లలు స్వీకరించి పౌష్టికాహార లోపం లేని విద్యార్థులుగా నిలవాలన్నదే తమ లక్ష్యమన్నారు.ఈ పథకంలో ఏవైనా ఇబ్బందులు,సమస్యలుంటే apscpcr2018@gmail.com కి సమాచారం అందిస్తే చర్యలకు ఆయా జిల్లాల కలెక్టర్లు,అధికారులకు చర్యలు నిమిత్తం సిఫారసులు చేయనున్నట్టు సీతారాం తెలిపారు.
ఈ పర్యటనలో సీతమ్మధార మండల విద్యాశాఖాధికారి డి.రామారావు,మధ్యాహ్న భోజన పథకం అమలుతీరు పరిశీలన అధికారి జె.ఎస్.శాస్త్రి,అక్షయ పాత్ర ఫౌండేషన్ మేనేజర్ వి.రామ్ మోహన్,స్కూల్ ప్రిన్సిపాల్ రామ్ ప్రసాద్,స్కూల్ పేరెంట్స్ కమిటీ చైర్ పర్సన్ పి.రఘు,ఎస్.కరుణాకర్,బి.హెన్నా,వార్డు సచివాలయం మహిళా సంరక్షణ కార్యదర్శులు,సంక్షేమ,ఆరోగ్య కార్యదర్శులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.