Breaking News

కొయ్యూరు: స్పందనకు విశేష స్పందన.

రికార్డ్ స్థాయిలో విజ్ఞప్తులు.

0 158

*కొయ్యూరు: స్పందనకు విశేష స్పందన.

*రికార్డ్ స్థాయిలో విజ్ఞప్తులు.

*ప్రజా సమస్యలు సత్వర పరిష్కారానికి మండల స్థాయి స్పందన.

*318 వినతులు స్వీకరణ – కలెక్టర్ సుమిత్ కుమార్.

అల్లూరి సీతారామరాజు జిల్లా,కొయ్యూరు మండలం: శుక్రవారం కొయ్యూరు మండల కేంద్రంలో నిర్వహించిన జగనన్నకు చెబుదాం స్పందన కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. ప్రజలు తమ సమస్యలను విన్నపాల రూపంలో తగు పరిష్కారం కోసం కలెక్టర్, జెసి, పిఓ లకు సమర్పించారు. రికార్డు స్థాయిలో 318 విన్నపాలు సమర్పించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు సంయుక్త కలెక్టర్,ఐటీడీఏ పిఓలతో సహా జిల్లా అధికారులందరూ మండల స్థాయి స్పందనకు హాజరు కావటంతో ప్రజలు పెద్ద ఎత్తున సమస్యలను అధికారుల దృష్టికి తీసుకు వచ్చారు.అందులో అధిక శాతం ఎన్ హెచ్ 516 ఇ రహదారి నిర్మాణానికి,డిఆర్డిఎ,పంచాయతి రాజ్,ఆర్.డబ్ల్యుఎస్,రెవెన్యూ శాఖల కు చెందిన దరఖాస్తులు వచ్చాయి.
ఈ సందర్భంగా కలెక్టర్ సుమిత్ కుమార్ మాట్లాడుతూ.. ప్రజలకు మరింత చేరువగా మెరుగైన సేవలు అందించటానికి, వారి సమస్యలు అత్యంత దగ్గరగా పరిశీలించి సత్వర పరిష్కార చర్యలు తీసుకోవడానికి మండల స్థాయిలో జగనన్నకు చెబుదాం ప్ర‌త్యేక స్పందన నిర్వహిస్తున్నట్లు చెప్పారు. సమస్యల పరిశ్కారానికి జిల్లా యంత్రాంగం వచ్చినందున సమస్యకు పరిష్కారం దొరుకుతుందనే నమ్మకంతో ప్రజలు విజ్ఞాపనలు సమర్పించారని, వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా ప్రతి సమస్యను నాణ్యవంతంగా పరిశ్కరించే దిశగా జిల్లా యంత్రాంగం కృషి చేయాలని, ప్రతి సమస్యపై ఒక విచారణ అధికారిని నియమించి సకాలంలో పరిష్కారం అందించాలని కలెక్టర్ ఆదేశించారు. అదేవిధంగా జగనన్నకు చెబుదాం పోర్టల్ లో నమోదైన ఫిర్యాదులను కూడా ఎప్పటికప్పుడు పరిశీలించి తగు పరిష్కార చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి వి. అభిషేక్ మాట్లాడుతూ ప్రజల నుండి అందిన ఫిర్యాదులు వెంట వెంటనే పరిష్కరించాలని, ఫిర్యాదు దారులను పదేపదే తిప్పించుకోవద్దని హితబోధ చేశారు.

ఈ జగనన్నకు చెబుదాం స్పందన కార్యక్రమంలో జేసి జే.శివ శ్రీనివాసు,ఐటిడిఎ ప్రాజెక్ట్ అధికారి వి. అభిషేక్, ఎంపిడిఓ లాలం సీతయ్య,తహసీల్దార్,సిహెచ్ తిరుమల రావు, ఎంపిపి బడుగు రమేష్ బాబు,జిల్లా స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు.

*కొయ్యూరు స్పందనలో అందిన కొన్ని ముఖ్య సమస్యలు:

1. వాతంగి గ్రామంలో నివసిస్తున్న భీమిరెడ్డి అనే ఇంటి పేరు గల వారు రాజవొమ్మంగి మండలంలో ఒసి కాపుగా నమోదు అయినప్పటికీ వాతంగి గ్రామంలో ఎస్టీ కొండారెడ్డి కులస్థులుగా ప్రభుత్వ పధకాలు, ఉద్యోగాలు, రాజకీయ పదవులు అనుభవిస్తున్నారని, వారిని తొలగించి నిజమైన ఎస్టీలకు లబ్ధి కల్పించాలని ఆ గ్రామ ప్రజలు ధరఖాస్తు చేసుకున్నారు.

2. ఆడాకుల గ్రామ సర్పంచి కురుపల్లి అప్పారావు ధరఖాస్తు చేస్తూ వారి గ్రామంలో 30 ఏళ్ల క్రితం నిర్మించిన ఆయుర్వేద అసుపత్రి భవనం శిథిలావస్థకు చేరుకున్నందున పక్కా భవనం నిర్మించాలని కోరారు.

3. కొయ్యూరు సర్పంచి ఎం.బాలరాజు ధరఖాస్తు చేస్తూ… కొయ్యూరు గ్రామం సంసద్ ఆదర్శ గ్రామంగా ఎంపికైనందున ఏడు అభివృద్ధి పనులు ఎంపిక చేశామని వాటికి అనుమతులు మంజూరు చేసి త్వరితగతిన పూర్తి చేయించాలని కోరారు.

4. ఏలేశ్వరం నుంచి కొయ్యూరు మీదుగా రేవళ్లు గ్రామానికి ప్రతి రోజూ ఆర్టీసీ బస్సు రెండు ట్రిప్పులు తిరుగుతోందనీ, దానిని ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న దాకోడు వరకూ సర్వీసు పొడిగించాలని కోరుతూ ఆర్. కంటారం, శాంతి నగర్ ప్రజలు కోరుతున్నారు.

5. వలసంపేట గ్రామానికి చెందిన బోలెం సోమరాజు తన భర్త పేరిట ఉన్న తన మామ గారి పొలం జాతీయ రహదారి నిర్మాణంలో భాగంగా పోతుందని అయితే దానికి సంభవించిన నష్ట పరిహారం కోసం వేరే వ్యక్తులు ధరఖాస్తు చేసుకున్నందున తనకు న్యాయం చేయాలని కోరారు.
6. చింతపల్లి మండలం పెదబరడ పంచాయతీ కృష్ణాపురం గ్రామంలో ఎంపియుపి పాఠశాల విద్యార్థులు,ఉపాధ్యాయులు,తల్లిదండ్రులు ధరఖాస్తు చేస్తూ… జాతీయ రహదారి 516-ఇ నిర్మాణంలో పాఠశాల ప్రహరీ, సెప్టిక్ ట్యాంక్, నీటి ట్యాంకు, మరుగుదొడ్లు నష్టపోలటమే కాకుండా విద్యార్థులకు ప్రమాదం, శబ్ధ, వాయు కాలుష్యం కలిగే అవకాశం ఉన్నందున రోడ్డుకు ఆవలివైపు ఉన్న స్థలంలో రహదారి నిర్మించాలని కోరారు.

7. మంప గ్రామంలో బిఎస్ఎన్ఎల్ టవర్ ఉన్నప్పటికీ సిగ్నల్ లేక ఇబ్బంది పడుతున్నారని, 4జి నెట్వర్క్ కు మార్పించాలని కోరుతూ ఆ గ్రామ నివాసి సూర్య చంద్ర పడాల్ ధరఖాస్తు చేసారు.

Leave A Reply

Your email address will not be published.