అల్లూరి సీతారామరాజు జిల్లా, పాడేరు: విధి నిర్వహణలో పాత్రికేయులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ సూచించారు. ఎన్నో వ్యయ ప్రయాసలను ఎదుర్కుంటూ విధులు నిర్వహిస్తున్నారని కొనియాడారు. ఐతే కొన్ని సందర్భాలలో కొన్ని జాగ్రత్తలు పాటిస్తే మంచిదని అభిప్రాయం వ్యక్త పరిచారు. ముఖ్యంగా డెడ్ బాడీలు, మైనర్లు లైంగిక హింస, థర్డ్ జనరేషన్ తదితర ఫోటోలు ప్రచురణలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. సోమవారం కలక్టరేట్ వీడియో సమావేశ మందిరంలో జిల్లా మీడియా ఎక్రిడిటేషన్ కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో కలెక్టర్ కమిటీ సభ్యులతో చర్చించి ప్రభుత్వ ఉత్తర్వులననుసరించి అర్హత కలిగిన 125 మందికి కమిటీ ఎక్రిడిటేషన్లు మంజూరు చేసింది. ఈ సందర్భంగా కలెకర్ మాట్లాడుతూ ఇంకా పెండింగ్ లో ఉన్న ధరఖాస్తులు పరిశీలించాలని, కొత్తగా ధరఖాస్తు చేసుకున్న వారి అర్హతలు పరిశీలించి తదుపరి సమావేశంలో నిర్ణయం తీసుకోవటానికి ప్రతిపాదించాలని డిపిఆర్ఓ గోవింద రాజులును ఆదేశించారు.
కమిటీలోని పాత్రికేయుల విజ్ఞప్తి మేరకు ఎక్రిడిటేషన్ లేని జర్నలిస్టుల సంక్షేమం కోసం ప్రత్యేకంగా జిల్లాలో ఒక మెడికల్ క్యాంపు ఏర్పాటు చేస్తానని, అందుకు డాల్ఫిన్ డయాగ్నోస్టిక్స్, గాయత్రి మెడికల్ కాలేజ్ వారికి లేఖలు రాయాలని ఆదేశించారు. జర్నలిస్టుల పిల్లల విద్య నిమిత్తం ప్రవేట్ పాటశాలలో 50 శాతం ఫీజు రాయితీ కోసం విద్యా సంస్థల యాజమాన్యాలకు లేఖ వ్రాస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. అదేవిధంగా పాడేరు, అరకు, రంపచోడవరం మండలాలలో ప్రెస్ అకాడమీ వారితో సంప్రదించి ఒకటి రెండు రోజుల శిక్షణా శిభిరాలను ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ కమిటీ సమావేశంలో కన్వీనర్ డిపిఆర్ఓ పి.గోవింద రాజులు, సభ్యులు హౌసింగ్ ఇఇ పి.బాబు, వైఎస్ఆర్ ఆరోగ్య శ్రీ కో-ఆర్డినేటర్ డా.రాజేష్, ప్రజా రవాణా శాఖ డిపో మేనేజర్ వి.శ్రీనివాస్, కార్మిక శాఖ ఉప కమిషనర్ టి.సుజాత, అరకు రైల్వే స్టేషన్ మేనేజర్ రాహుల్, సాక్షి, ఆంద్ర ప్రభ, టివి 9, 10 టివి రిపోర్టర్లు కె.దుర్గా రావు, డి.రామచంద్ర రావు, జే. శ్రీనివాసరావు, వి.మత్స్యలింగం, సమాచార శాఖ డివిజినల్ పౌర సంబంధాల అధికారి పండు రాములు, సంధ్య రాణి తదితరులు పాల్గొన్నారు.