Breaking News

జగనన్న సురక్షపై మీడియా సమావేశంలో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి.

0 61

జగనన్న సురక్ష సూపర్ సక్సెస్.. ప్రతి ఏటా రెండు పర్యాయాలుగా చేపట్టేలా సీఎం జగన్ ఆలోచన.

దేశానికే రోల్ మోడల్ గా ఏపీ ప్రభుత్వ క్రియాశీలత,సామర్థ్యం.

వ్యక్తిగా సమస్యను చూసి ప్రజల గడపకు వ్యవస్థను చేర్చిన నేత సీఎం జగన్.

జగనన్న సురక్షపై మీడియా సమావేశంలో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి.

తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ‘జగనన్న సురక్ష’ కార్యక్రమం అమలుతో సరికొత్త చరిత్ర సృష్టించిందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారు, వైఎస్సార్‌ సీపీ జనరల్‌ సెక్రటరీ సజ్జల రామకృష్ణా రెడ్డి తెలిపారు. ప్రజల గడప వద్దకే ప్రభుత్వ సుపరిపాలన తీసుకెళ్లాలన్న లక్ష్యంతో చేపట్టిన ఈ జగనన్న సురక్ష కార్యక్రమం సీఎం జగన్ మానస పుత్రికగా నిలిచిందన్నారు. నెల రోజులపాటు విజయవంతంగా కొనసాగిన జగనన్న సురక్ష కార్యక్రమం సక్సెక్‌ అయిన విధానం గురించి తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలోని ప్రతి పౌరుడి సమస్య, అవసరాలను గుర్తించి వాటిని పరిష్కరించేందుకు జగనన్న సురక్ష తీసుకొచ్చారని సజ్జల రామకృష్ణా రెడ్డి పేర్కొన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఇంటింటికీ వెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కరించిన ప్రభుత్వం దేశంలోనే ఎక్కడా లేదన్నారు.

అర్హులైన ఏ ఒక్కరూ లబ్దిపొందకుండా ఉండిపోరాదన్న లక్ష్యంతో:

అర్హులైన ప్రతి పౌరుడికి పథకాలను 100% సంక్షేమ పథకాలు ఇవ్వాలనే ఉద్దేశంతో జగనన్న సురక్ష కార్యక్రమాన్ని సీఎం జగన్‌ తీసుకొచ్చారని ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమం నిర్వహణకు ప్రభుత్వ ఉన్నత అధికారుల దగ్గరి నుంచి సచివాలయ ఉద్యోగుల వరకు అందరి సేవలను సమర్థవంతంగా వినియోగించుకున్నారన్నారు. జులై 1వ తేదీ నుంచి 31 వరకు.. అంటే 30 రోజులలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన జగనన్న సురక్ష కార్యక్రమానికి ప్రజల నుంచి అపూర్వ స్పందన లభించిందన్నారు. సీఎం జగన్‌ ‘చెప్పాడంటే – చేస్తాడంతే’ అని నమ్మకాన్ని ఈ కార్యక్రమం ద్వారా రుజువైందన్నారు.

1.46 కోట్ల కుటుంబాల సర్వే.. 93.5 లక్షల ప్రభుత్వ సేవలు:

ఆంధ్రప్రదేశ్ చరిత్రలో అతి తక్కువ కాల వ్యవధిలో అత్యధిక సేవలు అందించిన జగనన్న సురక్ష కార్యక్రమ గణాంకాలను సజ్జల వివరించారు. జూలై 1 నుంచి జూలై 31 వరకు రాష్ట్ర వ్యాప్తంగా 15,004 సచివాలయాల్లో జగనన్న సురక్ష శిబిరాలు నిర్వహించారని, జగనన్న సురక్ష కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా 1.46 కోట్ల (1,46,27,905) కుటుంబాలను వాలంటీర్లు సర్వే చేసి ప్రజలకు ఏ విధమైన సేవలను నమోదు చేసుకున్నారన్నారు. జగనన్న సురక్ష శిబిరాలకు వచ్చి 93.5 లక్షలకు పైగా (93,57,707) సేవలను ప్రజలు పొందారన్నారు. మొత్తం అభ్యర్థనల్లో దాదాపు ప్రభుత్వం 97 శాతం పరిష్కరించిందన్నారు. ఇక జులై 18న ఒక్క రోజే 7.54 లక్షల సర్టిఫికెట్లను అందించి రికార్డు సృష్టించిందన్నారు. ముఖ్యంగా ప్రజలు పొందిన సర్టిఫికెట్ల వివరాలు ఇలా.. ఇంటిగ్రేటెడ్ సర్టిఫికెట్లు (కొత్తవి) 45.33 లక్షలు, ఆదాయ ధృవీకరణ పత్రాలు 41.50 లక్షలు, ఆధార్-మొబైల్ అప్‌డేషన్ 2.72 లక్షలు, రెవెన్యూ హక్కుల రికార్డు (ROR-1B)/ ల్యాండ్ టైటిల్ 2.70 లక్షలు, అడంగల్ సర్టిఫికెట్లు: 1.40 లక్షలు ఉన్నాయి.

ఏటా రెండు పర్యాయాలుగా సురక్ష కార్యక్రమం నిర్వహించే ఆలోచనలో సీఎం జగన్:

తొలిసారి ప్రవేశపెట్టిన జగనన్న సురక్ష కార్యక్రమం విజయవంతమైనందున ఇకపై ఏడాదికి రెండు సార్లు ఇలాంటి కార్యక్రమాన్ని అమలు చేయాలనే ఆలోచనలో సీఎం జగన్‌ ఉన్నారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేసిన 1.69 లక్షల మంది వాలంటీర్లు, 1200 మండల అధికారులు, కలెక్టర్లు, సీనియర్ ఐఏఎస్‌ అధికారులు మరియు గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. గతంలో ఎప్పుడూ ఇలాంటి కార్యక్రమం టీడీపీ చేయలేదని.. కేవలం ప్రచారం చేసుకోవడానికి ఏవో కొన్ని కార్యక్రమాలను ఆ పార్టీ చేసిందని ఆరోపించారు.

చంద్రబాబుది కుట్రల రాజకీయం.. సీఎం జగన్ ది రాజకీయంలో ప్రజా సేవ:

ఇటీవల గోదావరి పరివాహక జిల్లాల్లో వర్షాలు కురవడం వల్ల, అదేవిధంగా ఎగువ రాష్ట్రల్లో వరదల వల్ల కొన్ని జిల్లాల్లోని ప్రజలు ఇబ్బందులకు గురయ్యారని సజ్జల రామకృష్ణా రెడ్డి తెలిపారు. వరదలు, వర్షాలు వచ్చినప్పుడల్లా వాలంటీర్లు, సచివాలయ వ్యవస్థలతో ముందు నుంచే సహాయ కార్యక్రమాలను సీఎం జగన్‌ అమలు చేస్తున్నారన్నారు. కానీ సీఎం జగన్‌ ఆ పునరావాస ప్రాంతాల్లో పర్యటించలేదు అని చంద్రబాబు విమర్శలు చేస్తున్నారని.. వాస్తవానికి విపత్తు నిర్వహణ సంస్థలు వీవీఐపీలు, వీఐపీలు వరదలు వచ్చిన సమయంలో వెంటనే రావద్దని చెబుతుంటారన్నారు. అక్కడ ఏవైనా ఇబ్బందులు వస్తాయని వారు రావద్దని అంటారని.. అవి తెలుసుకోకుండా చంద్రబాబు ఇష్టం వచ్చినట్లుగా ఆరోపణలు చేస్తున్నారన్నారు. అమరావతిలో భూములు చాలా మంది చేతులు మారాయని సజ్జల అన్నారు. అమరావతి అభివృద్దికి సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి కట్టుబడి ఉన్నారు. అందుకే అమరావతిలో పేదలకు ఇళ్లు కట్టించి ఇవ్వాలని భావించారన్నారు. పేదల పక్షపాతి సీఎం జగన్‌ అని.. పెట్టుబడిదారులకు లబ్ది చేకూర్చాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నాడన్నారు. ఈ విషయం రాష్ట్ర ప్రజలందరికీ తెలుసన్నారు. పులివెందుల పులి సునీత అని చంద్రబాబు అన్నప్పుడే దాని వెనుక ఉన్న అర్థం అర్థమైందన్నారు. సునీత వెనుక ఎవరు ఉన్నారో బహిరంగంగా ప్రకటిస్తే బాగుంటుందన్నారు. పులివెందులలోనే కాదు రాష్ట్రంలో చంద్రబాబు మాటలను నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరన్నారు.

Leave A Reply

Your email address will not be published.