Breaking News

పేద విద్యార్థుల ఉన్నత భవిష్యత్తు కోసం జగనన్న విదేశీ విద్యా దీవెన పథకం – సీఎం జగన్ మోహన్ రెడ్డి

0 64

పేద విద్యార్థుల ఉన్నత భవిష్యత్తు కోసం జగనన్న విదేశీ విద్యా దీవెన పథకం.

ఈ ఏడాది పథకం కింద 357 మంది విద్యార్థులకు రూ.45.53 కోట్లు జమ.

గత ప్రభుత్వం కంటే మెరుగ్గా..వివక్షకు తావులేకుండా పథకం అమలు చేస్తున్నాం- సీఎం జగన్మోహన్ రెడ్డి
తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్‌లోని పేద వర్గాల పిల్లలు, ఇతర పిల్లలు విదేశాల్లోని అగ్రగామి యూనివర్సిటీల్లో చదవాలని,వారి భవిష్యత్తు బాగుండాలని జగనన్న విదేశీ విద్యా దీవెన పథకం తీసుకురావడం జరిగిందని సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి తెలిపారు.జగనన్న విదేశీ విద్యా దీవెన పథకం కింద ఈ ఏడాదికి సంబంధించిన నిధులను జమ చేసే కార్యక్రమాన్ని గురువారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి సీఎం జగన్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి మాట్లాడుతు..మంచి కళాశాలల్లో సీట్లు వచ్చి కూడా అంతంత డబ్బులు కట్టి చదవాలనుకుంటే,ఆ స్థోమత లేని రాష్ట్ర విద్యార్థులు ఎవరూ ఇబ్బందులు పడకుండా.. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏటా స్కాలర్‌షిప్‌ రూపంలో వారికి సాయం చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. విదేశీ విద్య మన రాష్ట్ర విద్యార్థులకు ఓ వరంగా మారాలనే ఉద్దేశంతో విదేశీ విద్యా దీవెన పథకం ఎందరికో తోడ్పాడు అందిస్తోందన్నారు. ఈ పథకంలో భాగంగా విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న దాదాపు 357 మంది విద్యార్థులకు,వారి ఫీజుల కింద రూ.45.53 కోట్లు వారి తల్లుల ఖాతాల్లో జమ చేస్తున్నట్లు సీఎం జగన్‌ తెలిపారు. ఇందులో గత ఏడాదికి చెందిన విద్యార్థులు 290 మంది ఉండగా,ఈ ఏడాది 76 మందిని ఎంపిక చేయడం జరిగిందన్నారు.ఈ విద్యార్థుల తల్లుల ఖాతాలకు బటన్‌ నొక్కి డీబీటీ ద్వారా నగదు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు.

పూర్తి పారదర్శకంగా ఎంపిక:

ప్రపంచంలోని ప్రఖ్యాత గాంచిన టాప్‌-50 యూనివర్సిటీల్లో సీట్లు సాధించిన మన రాష్ట్ర విద్యార్థులను ఎంపిక చేస్తున్న సీఎం జగన్‌ పేర్కొన్నారు. ఇందులో ఎలాంటి వివక్షలకు తావు లేకుండా,పారదర్శకంగా విద్యార్థులను శాచురేషన్‌ విధానంలో ఎంపిక చేసినట్లు ఆయన తెలిపారు. పేద పిల్లలు మంచి కళాశాలల్లో సీట్లు సాధిస్తే..వారు ఉన్నత స్థాయికి చేరుకునే అవకాశం ఉంటుందని సీఎం జగన్‌ చెప్పారు. మంచి కళాశాలల్లో చదివితే ఉద్యోగాలు వస్తాయని, సీఈవోలు, మంచి నాయకులుగా ఎదిగే అవకాశం ఉంటుందని భావించి విదేశీ విద్యా దీవెన పథకం తీసుకొచ్చినట్లు సీఎం జగన్‌ వివరించారు. ఇవాళ ఎక్కడా లంచం, వివక్షకు తావులేకుండా..ఏ ఒక్కరికైనా క్యూఎస్‌, టైమ్స్‌ ఎడ్యుకేషన్‌ ర్యాంకింగ్స్‌లో టాప్‌-50 విద్యా సంస్థల్లో ఎవరికి ర్యాంకు వచ్చినా దరఖాస్తు పెట్టుకోవచ్చని,అలా దరఖాస్తు పెట్టుకున్న ప్రతి ఒక్కరికీ అర్హత ఉంటే..శాచురేషన్‌ విధానంలో ఎంపిక చేస్తామని ఆయన అన్నారు.

తల్లులకు పిల్లల చదువులు భారం కాకూడదు:

తల్లిదండ్రులు తమ పిల్లలను అప్పులు చదివిస్తున్నాం అని ఆందోళన చెందకూడదు.అదేవిధంగా పిల్లలు కూడా తమ తల్లిదండ్రులు అప్పులు చేస్తున్నారు, ఇబ్బందులు పడుతున్నారు అని బాధపడకూడదని ఈ విదేశీ విద్య దీవెన పథకం అమలు చేస్తున్నట్లు సీఎం జగన్‌ తెలిపారు. ఈ పథకం కింద నాలుగు వాయిదాల్లో ఈ స్కాలర్‌ షిప్‌ ఇస్తున్నామని, ఇమిగ్రేషన్‌ అవ్వగానే తొలి విడద సాయం,ఆ తర్వాత సెమిస్టర్‌ ఫలితాలు విడుదల అయిన తర్వాత విడదల వారీగా స్కాలర్‌ షిప్‌ రూపంలో డబ్బులు జమ చేస్తున్నట్లు సీఎం వివరించారు.ఇక ఎస్సీ, ఎస్టీ,బీసీ,మైనార్టీ పిల్లలకు రూ.1.25 కోట్లు ఫీజుల రూపంలో చెల్లిస్తున్నట్లు తెలిపారు.మిగిలిన పిల్లలకు కూడా కోటి రూపాయల వరకు సపోర్టు ఇస్తున్నట్లు సీఎం జగన్‌ పేర్కొన్నారు.విమాన ఛార్జీలు,విసా ఛార్జీల దగ్గరి నుంచి ప్రతి అడుగులో కూడా వారి చేయి పట్టుకుని నడిపించే పరిస్థితి ఉందన్నారు.

గత ప్రభుత్వ హయాంలో నీరుగారిన పథకం:

గత ప్రభుత్వ హయాంలో విదేశీ విద్య పథకం నీరుగారిపోయింది.గతంలో కేవలం 10 లక్షలు ఒక్కో విద్యార్థికి ఇచ్చేవారు..ఎస్సీ,ఎస్టీ,బీసీ, మైనార్టీలకు 15 లక్షల వరకు మాత్రమే ఇచ్చే వారు. గతంలో విద్యార్థుల ఎంపికలో కూడా రికమండేషన్లు ఉండేవి,నచ్చిన వారిని ఎంపిక చేసే వారు.ఇక 2016 నుంచి ఈ పథకం కింద బకాయిలు పేరుకుపోయాయి.దాదాపు రూ.318కోట్లు బకాయిలు పేరుకుపోయిన పరిస్థితి ఉంది.ఈ పథకాన్ని పూర్తిగా టీడీపీ నీరుగార్చింది. ఇవాళ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అర్హతే ప్రామాణికంగా విద్యార్థుల ఎంపిక ఉందని సీఎం జగన్‌ పేర్కొన్నారు. శాచురేషన్‌ పద్దతిలో వివక్షలకు తావు లేకుండా,పార్టీలు,వర్గాలకు తావు లేకుండా..అత్యంతం పారదర్శంగా అందరికీ న్యాయం చేయగలిగామని గర్వంగా చెబుతున్నామన్నారు. ఇది విప్లవాత్మక మార్పుకు నాంది పలికినట్టేనన్నారు. దాదాపు 21 ఫ్యాకల్టీస్‌లో 350 కళాశాల్లో ఎవరికి సీటు వచ్చినా సపోర్టు చేస్తున్న రాష్ట్రం మన రాష్ట్రం మాత్రమే అని సీఎం జగన్‌ పేర్కొన్నారు.టాప్‌ యూనివర్సిటీల్లో పేదవారు కూడా చదివే పరిస్థితులను తమ ప్రభుత్వం తీసుకొచ్చిందన్నారు.ఈ సందర్బంగా జగనన్న విదేశీ విద్యా దీవెన పథకం కింద ఎంపికైన పలువురు విద్యార్థులతో సీఎం జగన్‌ మాట్లాడారు. అనంతరం డీబీటీ ద్వారా విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నగదు జమ చేశారు. చివరిగా విద్యార్థులకు అభినందనలు తెలియజేసి, ఉన్నత చదువులు చదివి,మంచిగా స్థిరపడాలని సీఎం జగన్‌ ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి (గిరిజన సంక్షేమశాఖ) పీడిక రాజన్నదొర, సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగు నాగార్జున,సీఎస్‌ డాక్టర్ కె ఎస్ జవహర్ రెడ్డి,బీసీ సంక్షేమశాఖ స్పెషల్‌ సీఎస్‌ జి అనంతరాము,సాంఘిక సంక్షేమశాఖ ముఖ్యకార్యదర్శి బి జయలక్ష్మి, ఉన్నత విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి జె శ్యామలరావు, గిరిజన సంక్షేమశాఖ కార్యదర్శి కాంతిలాల్‌ దండే,మైనార్టీ సంక్షేమశాఖ కార్యదర్శి ఏ ఎండి ఇంతియాజ్,సాంఘిక సంక్షేమశాఖ డైరెక్టర్‌ కె విజయ,గిరిజన సంక్షేమశాఖ డైరెక్టర్‌ జె వెంకటమురళీ,ఉన్నతవిద్యామండలి ఛైర్మన్‌ కె హేమచంద్రారెడ్డి,ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.

Leave A Reply

Your email address will not be published.