Breaking News

మంచి చేస్తున్న‌వారికా? చేస్తాన‌న్న వారికా? ఎవ‌రికి మ‌ద్ద‌తిద్దాం?-పాడేరు ఎమ్మెల్యే

0 24

అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండ‌లం బ‌కులూరు స‌చివాల‌యం ప‌రిధిలో సోమ‌వారం వైసీపీ మండల పార్టీ అధ్యక్షుడు జల్లి బాబులు అధ్యక్షన ‘జ‌గ‌న‌న్న సుర‌క్ష’ కార్య‌క్ర‌మం బాలారంలో నిర్వహించారు.


 ఈ కార్య‌క్ర‌మానికి పాడేరు నియోజ‌క‌వ‌ర్గ ప‌రిశీల‌కులు చొక్కాకుల వెంక‌ట‌రావు, ఎమ్మెల్యే కొట్టగుళ్ళి భాగ్య‌ల‌క్ష్మి ముఖ్య అతిథులుగా హాజ‌రై టోకెన్లు జ‌న‌రేట్ చేసుకున్న వారికి స‌ర్టిఫికేట్లు అంద‌జేశారు. 

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ..చెప్పింది చెప్పినట్టు ప్రజలకు మంచి చేస్తున్న వారికా?చేస్తాన‌ని చెబుతున్న‌వారికా? ఎవ‌రికి మ‌ద్ద‌తిద్దామ‌ని పాడేరు ఎమ్మెల్యే కొట్ట‌గుళ్ళి భాగ్య‌ల‌క్ష్మి మ‌హిళ‌ల‌ను అడిగారు. పిల్లలకు ఉచితంగా యూనిఫామ్, షూ,సాక్షులు వంటివిస్తూ… ఉచిత విద్య‌నందిస్తూ… అమ్మ ఒడి ఇవ్వ‌డం అవ‌స‌ర‌మా? అని ప్ర‌శ్నించిన చంద్ర‌బాబు ఈరోజు త‌ల్లికి వంద‌నం పేరుతో ఎంత‌మంది పిల్ల‌లు ఉంటే అంత‌మందికీ సంవత్సరానికి 15వేలు ఇస్తాన‌డం సాధ్య‌మేనా అని ఆమె ప్రశ్నించారు.

 ఏజెన్సీ ప్రాంతంలో తాను గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో తిరుగుతూ ఉన్నప్పుడు గమనించిన విషయాన్ని బట్టి వారికి అవగాహన లేక ఆపరేషన్ అంటే భయంతో కొందరు ఎనిమిది నుంచి తొమ్మిది మంది పిల్లలను కన్నవారు కూడా ఉన్నారని, వారికి తల్లికి వందనం పేరుతో డబ్బులు వేయాలంటే లక్షకు పైనే సంవత్సరానికి వేయాల్సి ఉంటుందని, అది ఎలా సాధ్యమవుతుందో చెప్పాలని ఆమె టీడీపీని నిల‌దీశారు. ఇలా సాధ్యం కాని హామీలు ఇస్తూ మళ్లీ అధికారంలోకి వచ్చి అడ్డంగా దోచుకుతినాలని చంద్ర‌బాబు ఆలోచన చేస్తున్నార‌న్నారు.

 అందుకే ప్రజలంతా వాస్తవంలోనే బతకాలని ….మంచి చేస్తున్న వాళ్లు ముఖ్యమా? చేస్తానన్న వారు ముఖ్యమా? ఎవరికి మద్దతివ్వాలో ఆలోచించాలని కోరారు.

మంచి చేస్తున్న వారిని మాత్రమే నమ్మాలని, వారికే మద్దతు ఇవ్వాలని ఆమె కోరారు.

 2024లో సార్వత్రిక ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి చాలామంది తప్పుడు హామీలు ఇచ్చి గెలవడం కోసం ప్రయత్నిస్తుంటారని అందుకే ఈ విషయాలన్నీ తెలియజేయడం జరుగుతుందన్నారు.

  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ‘జగనన్న సురక్ష’ కార్యక్రమం ప్రారంభించిన నాటి నుండి రాష్ట్రవ్యాప్తంగా నిరంతరాయంగా దిగ్విజయంగా సాగుతున్నట్లు ఆమె తెలిపారు.

 బ‌కులూరు స‌చివాల‌యం ప‌రిధిలో 1600 టోకెన్లు జనరేట్ చేశారని వారంద‌రికీ స‌ర్టిఫికేట్లు ఇచ్చామ‌న్నారు. 

 ఇదివరకు సర్టిఫికెట్లు తీసుకునే విషయంలో ఎంత జాప్యం జరిగేదన్న‌ విషయాలను వివరిస్తూ… గత ప్రభుత్వానికి, జగనన్న ప్రభుత్వానికి తేడాను గమనించాలని ప్రజలను కోరారు.

 ఈరోజు ప్రజల వద్దకే వచ్చి మీకు కావాల్సిన సర్టిఫికెట్లు అందిస్తున్న జగనన్న సర్కార్ కి, గత చంద్రబాబు సర్కార్ కి ఉన్నటువంటి తేడాను క్షుణ్ణంగా పరిశీలించాలని చెప్పారు.

 వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేశారా? లేదా? అన్న విషయాల్ని కూడా పట్టించుకోకుండా అర్హత ఒక్క‌టే ప్రామాణికంగా సంక్షేమ పథకాలు అందిస్తున్నామన్నారు.

 బాలారం నుంచి కిష్టారం వరకు ఐదున్నర కిలోమీటర్ల మేర 4 కోట్ల 70 లక్షల రూపాయలు ఖర్చుపెట్టి రోడ్డు వేయడం జరిగిందని, ఇప్పటి వరకు అనేక ప్రభుత్వాలు వ‌చ్చినా వారంద‌రికీ మీరంతా రిప్రజెంటేషన్లు ఇచ్చినా ఆ సమస్యకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మాత్రమే పరిష్కారం ల‌భించింద‌న్నారు. 

 ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ పొట్టిక శ్రీను,వైస్ ఎంపీపీ అప్పన వెంకటరమణ,ట్రైకార్ డైరెక్టర్ సుమర్ల సరస్వతి,బిసి డైరెక్టర్ గాడి నాగమణి, మండల కన్వీనర్ బండి సుధాకర్, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు అచ్యుత్, కుమారి,కంఠారం వైస్ సర్పంచ్ కాళ్ల వనుంబాబు,సీనియర్ నాయకులు గాడి సత్యనారాయణ, బంటు బుజ్జి, పాటి శేఖర్, సీహెచ్‌ అప్పారావు,పొట్టిక పోతురాజు,సోషల్ మీడియా కన్వీనర్ గాడి అచ్చిరాజు,నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.