కాసులకు కక్కుర్తిపడి తారు రోడ్డు అధ్వానంగా వేస్తున్న కాంట్రాక్టర్లు.
కనీస పర్యవేక్షణ లేని అధికారులు.
ఆగ్రహం చెందుతున్న గిరిజనులు.
తారు రోడ్డు మూడు నెలల ముచ్చటే… రోడ్డు మద్యలో గుంతలు మయం.
ప్రభుత్వం కోట్ల రూపాయలు మన్యం రహదారుల కోసం కేటాయిస్తుంటే, గుత్తేదారులు నాణ్యతలేని రోడ్లు వేసి బిల్లులు మార్చుకుంటున్నారు.
విశాఖ ఏజెన్సీ,
జీ కే వీధి మండలం, ఏబులం నుండి పెదవలస వరకు ప్రధానమంత్రి గ్రామసడక్ యోజన పథకం తారు రోడ్డు నిర్మాణం 13 కిలో మీటర్లు, అంచనా విలువ: 658.70 లక్షలు, దాదాపు ఈ రోడ్డు పని పూర్తి కానుంది.రోడ్డు పొడవునా అక్కడ అక్కడ గుంతలు,కొన్ని చోట్లా రోడ్డు మధ్యలో తారు కలిపిన చిన్న చిన్న చిప్స్ రాళ్ళు చేత్తో ఏరుకోవచ్చు. దీని బట్టి అర్థం చేసుకోవచ్చు రోడ్డు నాణ్యత ఏపాటిదో,దీని కోసం ఇంజినీరింగ్ చెయ్యనవసరం లేదు. పంచాయితీరాజ్ శాఖ అధికారులు కళ్ళు మూసుకుని నిదుర పోతున్నారా? ప్రజా ధనం కోట్ల రూపాయలు ఖర్చు చేసి నిర్మిస్తున్న రోడ్లను నాణ్యత విషయంలో ఎందుకు అధికారులు,ప్రజాప్రతినిధులు నోరు మెదపడం లేదు. ఈ మధ్య కాలంలో ఏజెన్సీలో నిర్మిస్తున్న ప్రతీ రోడ్డు దుస్థితి ఇదే.గిరిజనులు మా ప్రాంతానికి తారురోడ్డు వచ్చిందని ఆనంద పడాలో రోడ్డు నాణ్యత లేక బాద పడాలో అర్ధం కాని పరిస్థితి.అయ్యా ప్రజా ప్రతినిధులారా, అధికారులారా రానున్న రోజుల్లో కాంట్రాక్టర్లను ఇలాగే చూసి చూడనట్లు వదిలేస్తే తారు రోడ్లలో తారు కనిపించకుండా తారు రోడ్లు నిర్మిస్తారని పలువురు ప్రజలు ఆరోపిస్తున్నారు.