పాదాభివందనం చేసి పద్మశ్రీ అందుకున్న 125 ఏళ్ల యోగా గురువు.
రాష్ట్రపతి భవన్‌లోని దర్బార్ హాల్‌లో పద్మ పురస్కారాల ప్రధానోత్సవం సందర్భంగా ఓ స్వామిజీకి సంబంధించిన దృశ్యాలు భావోద్వేగానికి గురిచేస్తున్నాయి.
125 ఏళ్ల ఆ యోగా గురువు పేరు స్వామి శివానంద. దేశంలోని పలు ప్రాంతాల్లో ఆయన అధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. పూరీలో 50 ఏళ్లుగా 400 నుంచి 600 మంది కుష్ఠు రోగులకు సేవ చేస్తున్నారు. ఆయన చేసిన సేవలకు గాను 2022 సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు ప్రకటించింది.
రాష్ట్రపతి భవన్‌లో సోమవారం మార్చి 21న జరిగిన పురస్కారాల ప్రధానోత్సవానికి స్వామి శివానంద.. తెల్లని ధోవతి, కుర్తా ధరించి, కాళ్లకు చెప్పులు లేకుండా అతి సామాన్యంగా వచ్చారు. దర్బార్ హాల్‌లో ఆయన పేరు పిలవగానే ఆయన తన స్థానం నుంచి లేచొచ్చి, మొదట ప్రధాని నరేంద్ర మోదీకి పాదాభివందనం చేశారు. అనంతరం రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్‌కు రెండుసార్లు పాదాభివందనం చేశారు.
125 ఏళ్ల శివానంద పేరును పద్మశ్రీ పురస్కారం ప్రధానం కోసం పిలవగానే దర్బార్ హాలులో అందరూ కరతాళధ్వనులతో అభినందించారు. ఆ వెంటనే ఆయన ప్రధానికి, రాష్ట్రపతికి పాదాభివందనం చేసిన దృశ్యాలు వారిని మరింత కదిలించాయి. హాలులో ఉన్నవారంతా లేచి నిలబడి కరతాళ ధ్వనులు చేశారు.